శ్రీనివాసుని మదిని తలచి
హృదయమందు దృష్టి నిలిపి
ధ్యానమాచరించితె , నీవు
జ్ఞానివవుతావు
పరబ్రహ్మమే సృష్టి మూలం
పరబ్రహ్మమే జీవ బీజం
పరబ్రహ్మమే నిత్య సత్యం
బ్రహ్మ నీవేనోయ్
జరిగేదేంటో జరగనియ్యి
కాలమిలా గడపనియ్యి
కనబడేదే దైవమని నువు
గట్టిగా నమ్ము
సుఖం దు:ఖం ఓర్చుకుంటూ
బ్రహ్మ తత్త్వం నేర్చుకుంటూ
ధర్మ మార్గం చూచుకుంటూ
జీవితము గడుపు
బుడగ లాంటిది మనిషి బ్రతుకు
జడిసి పోటం ఎందుకోయీ
వచ్చినట్టిది ఎప్పుడైనా
చచ్చి పోతుందోయ్
సృష్టి మర్మం క్లిష్ట మైనది
కష్టం మోయీ తెలుసుకోటం
సృష్టి నడిపే పరాశక్తిని
గట్టిగా పట్టు .
కాలిపోతుందీ శరీరం
రాలిపోతుందీ శరీరం
ఎందుకింత దీని కోసం
వెర్రి ఆరాటం
మూట గట్టిన గాలి మాదిరి
బూటకము ఈ బ్రతుకు సుమ్మీ
లేనిదున్నటు , ఉంది లేనటు
కపట నాటకమోయ్
తల్ల క్రిందులు గాను నిలిచి
తపశ్చేసిన లాభ మేమిటి
లోపలున్న నేన్ను నీవు
తెలుసు కోవాలోయ్
చేయవలసిన వన్ని చెయ్యి
దేముడి పై భారమేయ్యి
మూడు గుణముల ముచ్చటలో
మునిగి పోకోయీ
మరుక్షణమున ఏమిజరుగునొ
మనకు తెలియనిదీ ప్రయాణం
పరమ పురుషుని పదము పట్టి
మెదలుతుండాలోయ్
కోర్కెలన్నీ మట్టె పెట్టు
హృదయమందున మనసు పెట్టు
లేని దానిని వదలి పెట్టు
ఉన్నదొకటే ఎక్కు మెట్టు
కోరవలసిన కోర్కె లేదు
చేరవలసిన ఊరు లేదు
కాలమంతా గడిప గడిపి
కలిసి పోవటమే
ఆడుకుంటూ , పాడుకుంటూ
హాయి గా బ్రతకాల మనిషి
హృదయ మందున ఉన్న దేవుని
మదిని మరవకను
కాయలన్నీ పండుతున్నై
ఆకులన్నీ రాలుతున్నై
బాలురంతా వృద్దులైతే
భయం నీకేలా
ఎందుకో ఈ మనుషులందరు
పందె మేసుకు పరుగులిడడం
ముందు సంగతు లెరుగ లేక
మోసపోతారు
మూట గట్టి తలపులన్నీ
పాతి పెట్టు హృదయ గుహలో
జీవ జ్యోతిని ప్రజ్వలిస్తే
దేవుడౌతావు
మూరెడేసి గడ్డములతో
బారెడేసి మీసములతో
కారు యోగులు , మూడు గుణముల
జోరు తగ్గాలోయ్
వృద్ధుడైపోయాను నేను
వ్యర్ధ మయి పోయింది బ్రతుకు
పొందవలసిన జ్ఞ్యాన మింకా
అందలేదోయి
సత్యమే పలకాల నెపుడు
చిత్తమగు పరిశుద్ధ మపుడు
ఉత్తముడ వై లోకమందున
ఉన్నతిని గన వోయ్
సత్యము , ధర్మమూ , తప్పక
నిత్యమూ దేముడిని తలచు చు
భత్యమున కై కష్ట పడి , ఔ
న్నత్యమును గనవోయ్
అపజయం కలగొచ్చు ,హృదయం
తడబడీ బెదరొచ్చు , లోకులు
పాక పకా నవ్వొచ్చు , మానకు
దైవ ప్రార్ధనను
ఉత్త మాటలు కావు నమ్ముము
ప్రస్తుతపు సౌఖ్యాలు కల్లలు
శాశ్వతం గా చింత లేని
స్థానమును వెదుకు
పరుగులేట్టిన లాభ మేమి
బరువులేత్తిన లాభ మేమి
మరుగు గా కూర్చున్న వాడే
మనిషి లేవోయీ
చాల పనులున్నాయి చేయగ
కాల సర్పము చుట్టి వేసెను
మనుషులతి అసమర్ధులు
మరణము ముంచి వేస్తుంది
నేను వేసిన జ్ఞ్యాన బీజం
కన్ను తెరుచును ఈ సమాజం
మండుతున్న కడుపు మంట
ఉండ నిస్తుందా

No comments:
Post a Comment